28 October 2012

దేవుడు - సైకాలజీ


దేవుడనే వాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం. ఆ సందేహం తీర్చుకోవడానికి మనిషి ఏం చేశాడు? ఉంటే ఉన్నాడు... లేకుంటే లేడు. ఓ దండం పారేస్తే పడుంటుంది అనుకున్నాడు. కృషిని వదిలేసి అభూత కల్పనల ఒయాసిస్సుల్లో సేదతీరాడు. దేవుడు గారికి కోపం వచ్చింది. అరిషడ్వర్గాలనే ఆరుగురు సైనికులను మనిషిమీదకు యుద్ధానికి పంపాడు. మనిషికి విశ్రాంతి నశించింది. యుగాల తరబడి యుద్ధం చేస్తూ ఓడిపోతూనే ఉన్నాడు. ఉన్నావా... అసలున్నావా? నువ్వు లేవని నిరూపించదలుచుకున్నావా అంటూ ఇంకా అయోమయంలోనే మనిషి మాత్రం ఉన్నాడు.  


అసలు మనిషికి దేవుని అవసరం ఎందుకు కలిగింది? అని ప్రశ్నిస్తే... అతడు తన పరిమితులు తెలుసుకోవడం వల్ల అని సమాధానం చెప్పవలసి వస్తుంది. తాను సాధించలేని మహా విజయాల విషయంలో దైవసంకల్పం ఇంతే అని స్థిమిత పడడం నేర్చుకున్నాడు. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న సూపర్‌ పవర్‌ ఏదో ఉందను కోవడం మొదలుపెట్టాడు. తనకు నచ్చిన పేరు పెట్టుకున్నాడు. సాకారంగానో, నిరాకారంగానో ఆరాధించడం మొదలుపెట్టాడు. విశ్వరహస్యాలను శోధించాలనే శాస్త్రీయ దృష్టి లోపించింది.
విశ్వాసం నుంచి వెలుగువైపుకి, వాదాలనుంచి విజ్ఞానం వైపుకి మానవుని ప్రస్థానం కొనసాగ వలసిన దశలో... దైవభక్తి పెరుగుతూ వస్తోందని అందరూ అనుకుంటున్న ఈ తరుణంలోనే అంధ విశ్వాసం, విచక్షణా రాహిత్యం కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దైవభక్తి సైతం మానసిక అసమతౌల్యానికి కారణమవుతోంది. అవిశ్రాంతికి కారణమవుతోంది. ఎందుకిలా జరుగుతోంది? అని ప్రశ్నిస్తే... దైవాన్ని దర్శించాలని, కనీసం దైవ భావనను హృదయమంతా నింపుకోవాలని మనిషి అనుకోవడం లేదు. తనకు ప్రస్తుతం ఉన్నవాటికంటే హెచ్చుగా డబ్బు, అధికారం, హోదా వంటివి రావాలని మాత్రమే కోరుకుంటున్నాడు. మరోలా చెప్పాలంటే సమాజంలోని సాటి మానవుల దృష్టిలో సమున్నతునిగా ఎదగడమే మనిషికి కావలసింది. ఈ ఒక్క కోరికా చెల్లిస్తే చాలు... దైవం కనబడక పోయినా, మాట్లాడకపోయినా.
ఎందుగల డెందులేడు?
గ్రహం విరూపం చెందితే విగ్రహం అవుతుంది. విగ్రహాన్ని సాధించాలంటే నిగ్రహం అవసరం. కొందరు పూజిస్తారు. ఇది సాకార, సగుణ భావన. మరికొందరు వాటిని పగలగొట్టి అరూపాన్ని దర్శిస్తారు. అది వారి పద్ధతి. కొందరికి చిహ్నాలు చాలు.  ప్రకృతిని ఆరాధించేవారు కొందరు. దైవం మానవ రూపంలో ఉంటాడని బాబాలను కొలిచేవారు ఇంకొందరు. కొందరిది యోగపద్ధతి. మరికొందరిది ధ్యానపద్ధతి. మార్గం ఏదైనప్పటికీ మానవులందరి గమ్యం ఒక్కటే. మతాలన్నీ బోధించేది దేవుడు ఒక్కడేనని దాదాపుగా అందరం ఒప్పుకుంటాం... విశ్వసిస్తాం.
విశ్వాసానికి రెండు లక్షణాలున్నాయి. మొదటిది ఆదర్శ ప్రాయమైనది. రెండోది ఆచరణ శీలమైనది.
తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడంటారు. తెలిసి చేసినా, తెలియక చేసిన తప్పు తప్పే అంటారు. అపరిమితమైన క్షమాగుణం దేవుని సొంతం కాబట్టి ఆయన్ని వేడుకుంటే క్షమాభిక్ష పెడతాడంటారు. తెలియక చేసిన తప్పుల సంగతి వదిలేద్దాం. ఉద్రేకంలో, ఒళ్లు తెలియని ఉన్మాదంలో చేసిన తప్పుల సంగతి కూడా పక్కన పెడదాం. పూర్తి స్పృహలో ఉండి రోజువారీ మనం చేస్తున్న తప్పుల్ని ఏం చేద్దాం? ఆఫీసులో బాసు చీల్చిచెండాడతాడు కాబట్టి తప్పు చేయడానికి జంకుతాం. అదే ఎవరికీ తెలియకుండా మనస్సాక్షికి, దైవానికి మాత్రమే తెలిసి మూడోకంటికి తెలియని తప్పులు చేయడానికి మనలో చాలామందిమి వెనకాడం. ఎందుకని? మన విశ్వాసం ఏ స్థాయిలో ఉన్నట్లు? దైవదండనకు సిద్ధపడుతున్నామా? అది పడినప్పుడు చూసుకుందాంలే అని కళ్లుమూసుకుని పాపానికి ఒడిగడుతున్నామా?
పైన చెప్పినట్లు విశ్వాసానికి రెండు లక్షణాలున్నాయి. మొదటిది ఆదర్శ ప్రాయమైనది. రెండోది ఆచరణ శీలమైనది. ఇవి రెండు లక్షణాలను ప్రస్ఫుటంగా ప్రకటించిన హేతువాది శ్రీ గోరా. గ్రహణ సమయంలో తన భార్యను ఆరుబయట తిప్పి గ్రహణం మొర్రి వ్యాధికి, గ్రహణాలకు సంబంధాలకు సంబంధం లేదని నిరూపించారు. జీవిత కాలంపాటు తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి రాజీలేని పోరాటం చేశారు. ధైర్యాన్ని ప్రదర్శించడం అది.... విశ్వాసం అనే మాటకు నిజమైన అర్ధం అది.... మనలో ఉందా?
సత్యంతో ప్రయోగం
గాంధీజీ వారణాశి వెళ్లారు. అక్కడి అపరిశుభ్రమైన వాతావరణం ఆయనకు ప్రశాంతతను కలిగించకపోగా, విపరీతమైన చిరాకు తెప్పించింది. పైసా దక్షిణ అడిగిన పండా ప్రవర్తన జుగుప్స కలిగించింది. ఆ తర్వాతేం జరిగింది అనే సంగతులు ఇక్కడ ప్రస్తావించడం లేదు. మనసు నిర్మలంగా లేనప్పుడు కాశీ వెళ్లినా ఖాజీపేటలో ఉన్నా ఒకటే అని చెప్పడమే ఈ ఉదాహరణ పరమార్ధం.
తరచుగా తీర్ధయాత్రలు చేసేవారున్నారు. ఖర్చు పెట్టిన డబ్బులో ఎన్నోవంతు ప్రశాంతతను కొని తెచ్చుకున్నారు అనేది ప్రశ్న. టిక్కెట్‌ కొని రైలెక్కినది మొదలుకుని తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఎంతసేపు దైవ చింతనలో గడపామన్నది ప్రశ్న. తీర్ధయాత్ర వల్ల తెలుసుకోవలసిన విశేషాలు ఏమేమి ఉన్నాయని మతం చెప్పిందో వాటిలో కొన్నింటినైనా తరచి చూశామా అనేది ప్రశ్న. వెళ్లేదాకా ఆరాటం, తిరిగొచ్చేదాకా కంగారం. ఎక్కడికెళ్లినా డబ్బు ఖర్చుని గురించిన ఆలోచన, సౌకర్యాలను గురించి ప్రశ్నించడంలో పడి ఆధ్యాత్మిక చింతనకు దూరమై పోవడం విషాదకరం. ఆధ్యాత్మిక సాధన వీకెండ్‌తో మొదలై సోమవారంతో పూర్తయ్యేది కాదు.
కళాత్మక చిత్రాల దర్శకుడు కె. విశ్వనాథ్‌ ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. ‘‘నేను అన్ని మతాల దేవాలయాలకు వెళ్తాను. నా వృత్తిలో భాగంగా నేను చూసిన ప్రదేశాలలో మసీదు, చర్చి, గురుద్వార అనే భేదం లేకుండా అన్ని చోట్లకూ వెళ్లాను. అయితే దైవాన్ని దర్శించడం కోసం పుణ్యక్షేత్రాలను దర్శించాలనే తత్వానికి నేను విరుద్ధం.  ఒక్కోసారి మన ఇంటిపక్కనే పాడుబడిన ఆలయంలో కూడా గొప్ప ప్రశాంతత లభిస్తుంది. మహాదేవుడు మనసులో ఉంటే మొండిగోడను చూస్తూ కూర్చున్నా ధ్యానం సజావుగానే సాగుతుంది.’’    
భక్తి కరెన్సీ నోటుతో కొనుక్కోగలిగేది కాదు. పుణ్యక్షేత్రాల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టడం ఇప్పటి ట్రెండ్‌. అందరికీ తెలిసిన ఉదాహరణలు కాకుండా ఇక్కడ ఒక ప్రైవేట్‌ వ్యవహారం చెబుతాను. నాకు తెలిసిన స్నేహితులు ఇద్దరు ఉన్నారు. అడవుల్లో దొరికే సారాయి తాగడం కోసం కంపెనీ కారుపై శ్రీశైలం వెళ్లారు. కరువు తీరా తాగారు. దేవుని సేవలో తనివి తీరా పాల్గొన్నారు. తిరిగి వచ్చేశారు. ఆ ఆర్ధిక సంవత్సరం చివరిలో వాళ్లిద్దరినీ కంపెనీ బర్తరఫ్‌ చేసింది. ఇది యాదృచ్ఛికం అయినా ఇరవై సంవత్సరాల సర్వీసు తర్వాత ఎటూకాని వయస్సులో వాళ్లకిప్పుడు ఉద్యోగాలు లేవు.
మానవుడే మహనీయుడు
ప్రాణం పోసిన బొమ్మను చరాచర జగత్తులోనికి పంపేంత వరకే పరమాత్మ బాధ్యత. ఆ తర్వాత జరిగేదంతా మనిషి చేతిలోనిదే. మనిషి తన జీవన మార్గాన్ని ఎంచుకోవడాన్ని బట్టి ఉంటుంది. తాను మార్గాన్ని ఎల్లవేళలా నిర్దేశించలేకపోవచ్చు. కానీ నడిచి వెళ్లగలడు. ఆ మాత్రం శక్తి ఇస్తేనే మనిషి ఇన్ని అద్భుతాలను ఆవిష్కరించాడు కదా! ఇంకా ఏం కోరుకుంటున్నాడు మనిషి? పేరాశలు పెనుచీకట్లు సృష్టిస్తే జడుసుకుంటున్నాడేమో.... అందుకే భగవంతుడా వెలుగు చూపమని అప్పుడప్పుడూ అరుస్తుంటాడు. వెలుగురేఖ కనబడగానే ఇందాకటి భయాన్ని మరిచిపోయి.... నేనే సాధించానని బోరవిరుచుకుంటాడు.  మనిషిలో భయం, గర్వం అనే రెండు లక్షణాలు లేకపోతే ఈపాటికి దైవాన్ని కాలదన్నేవాడే.
బాగా చదివినవాడికి పరీక్ష హాల్లో భయం వేస్తుందా? అచంచలమైన దైవభక్తి కూడా ఇలాంటిదే.... భయాన్ని పోగొడుతుంది. ధైర్యాన్నిస్తుంది.  అయితే ఆ ధైర్యం ఎప్పుడు కలుగుతుంది? ఎలా కలుగుతుంది? అంటే.... కాలంతో పోటీ పడుతూ, కృషి లోపం లేకుండా శ్రమిస్తానని హామీ ఇచ్చినప్పుడు కలుగుతుంది. దైవభక్తి వల్ల సానుకూల దృక్పథం (పాజిటివ్‌ థింకింగ్‌) ఏర్పడుతుందని నమ్ముతారు. భక్తి లేకపోతే... నిత్య కృషీవలుడు కావాలి. తనకు తెలిసిన దారిలో పని చేసుకుంటూ పోవాలి. జీవన మార్గంలో ఎదురయ్యే సవాళ్లన్నింటికీ నిలబడి ఆలోచించుకోగలిగే నేర్పు కావాలి. అలా ఆగి ఆలోచించే పద్ధతికే దైవభక్తి అని పేరు పెట్టుకుంటే ప్రమాదం కాబోదు. అలాగని ప్రతి చిన్న సంగతినీ దైవంపై భారం వేసి లాగించేయాలని, తప్పించుకోవాలని చూడడం సరికాదు.
నీ ఆలోచనల్లో పాజిటివ్‌ దృక్పథం ఉంటే నీలో డిప్రెషన్‌ పోతుంది. అందుకు దైవభక్తిని తోడు తెచ్చుకుంటే తప్పు కాదు. ప్రతి ఆధ్యాత్మిక ఆచారం వెనుకా ఎంతో కొంత శాస్త్రీయత ఉందని ఇటీవల కాలంలో తెలియవస్తోంది. గుంజీళ్లు తీయడం, మోకాళ్లపై కూర్చుని ప్రార్ధన చేయడం, రెండు చేతులనూ కలిపి స్మరించడం వంటివన్నీ ఆరోగ్య సూత్రాలుగా పేరుపడ్డాయి. చప్పట్లు కొడితే నరాలు ఉత్తేజితం అవుతాయి. గట్టిగా అరుస్తూ పాడితే ఒక ప్రయోజనం, మౌనంగా ధ్యానం చేస్తే వేరొక ప్రయోజనం ఉన్నాయి. ఏదేమైనా రోజులో కొంతసేపు నీకు ఇష్టమైన పనిలో త్రికరణ శుద్ధిగా నిమగ్నమైతే టెన్షన్‌ మటుమాయమవుతుంది. ఈ రకమైన పరిష్కార మార్గాలు దైవభక్తితో ప్రమేయం ఉన్నా, లేకున్నా సమస్యలను తగ్గిస్తాయి. కాకపోతే మనిషి తనను అసమర్ధునిగా భావించుకోవడం మానేసి నిత్య సాధకునిగా మారవలసి ఉంటుంది.
అసలేం జరుగుతోందిప్పుడు... 
మనిషి మతాన్ని పట్టుకుని దేవుళ్లాడాడు. తాను నమ్మినదానిపై గుడ్డి నమ్మకాన్ని, ఇతర మతాలపై అసహనాన్ని పెంచుకున్నాడు. కల్లోలాలు చెలరేగాయి. డబ్బు, అధికారం, స్త్రీ ఈ మూడు కారణాలకోసం యుద్ధాలు జరిగినప్పుడు కంటే హెచ్చుగా మత యుద్ధాలు చెలరేగిన ఫలితం వినాశనానికి దారితీసింది.... అదే సంస్కృతులు ఛిన్నాభిన్నమైపోవడం. భాషలు మూగబోయాయి. పలుకుబళ్లు మటుమాయమయ్యాయి. సారస్వతం మట్టికొట్టుకుపోంది. వృత్తులన్నీ చెల్లాచెదరైపోయాయి. ఇక మనిషికి దిక్సూచిగా నిలబడగలిగేది ఏముంది?.... డబ్బుని మీదేసుకుని పోవడం ఎలాగో చెప్పే దైవకణం చెబుతుందేమో కనుక్కోవడమే మిగిలింది.
ధనమేరా అన్నిటికీ మూలం అంటే కాదనబోవడం లేదు. డబ్బుకి తొలి ప్రాధాన్యం ఇచ్చిన మనిషి జ్ఞాన సముపార్జనకు  మాత్రం కించిత్తు చోటు దక్కనీయడం లేదు. ముఖ్యంగా భారతదేశంలో వరుస యుద్ధాలు, వలస పాలన, అవినీతి మయమైపోయిన ప్రజాస్వామ్యం.... ఇవన్నీ భారతీయ సంప్రదాయాన్ని, ముఖ్యంగా విద్యావ్యవస్థను చెడగొట్టి వదిలిపెట్టాయి. ఇందులో స్వయంకృతాలూ ఉన్నాయి.
అభ్యాసం ప్రాధమిక దశలో చేయవలసినది. అధ్యయనం బ్రతికి ఉన్నంత కాలం చేయవలసినదే.
విద్యా దాహానికి పరిమితి లేదు. దాన్ని సర్టిఫికెట్లతో చల్లార్చుకోలేం.  దురదృష్టం.... నేటి మనిషి విద్యను కాదని తనను తాను డబ్బు సంపాదించే యంత్రంగా మార్చుకుంటున్నాడు. అలాంటి యంత్రాన్నే పెళ్లాడుతున్నాడు. వాటినే సంతానంగా కంటున్నాడు.
ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అనుకున్నాక గారాబం మితిమీరిపోయింది. కనీసం పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం మానేశాం. దండం పెట్టుకో పరీక్ష పాసైపోతావు, మంచి ప్యాకేజీ వస్తుంది అని మాత్రమే చెబుతున్నాం. ఒక్కసారిగా బూమ్‌ పడిపోతే కొంపలంటుకు పోయింది ఏముంది? నిన్నటిదాకా సంపాదించింది ఏమైంది?... అని అడగడానికి తాహతు చాలడం లేదు. ఫలానా గుడికి వెళ్లరా... పూజలు చేయించుకో అంటాం. మన కుర్రాళ్లకి గుళ్లో చొక్కా ఎందుకు తీసేయాలో తెలీదు. నమాజ్‌ చేస్తుంటే తలకు గుడ్డ ఎందుకు చుట్టుకోవాలో తెలియదు. చర్చిలో కొవ్వొత్తులు ఎందుకు వెలిగిస్తారో తెలియదు. పొద్దున్నే టీవీలో ఎవరేం చెబితే అదే మనకు వేదం.
మన భక్తి, విశ్వాసాలు రాష్ట్రంలో కరెంట్‌ కోతల్లాంటివి. ఏ సమయంలో సరఫరా అవుతాయో, ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు. గొర్రెల మంద తీరు. ఎప్పుడు ఏ ఉపద్రవాన్ని తెచ్చిపెడతాయో తెలియదు. దశావతారం సినిమా తరవాత కమల్‌ హాసన్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోవచ్చు. ‘‘నాకు సంబంధించి నంతవరకు భక్తి అనేది పడగ్గది వ్యవహారం లాంటిది. అందులోకి ఎవరూ తొంగి చూడాలని అనుకోను. లోపల ఏం జరుగుతుందో ఎవరితోనూ పంచుకోవాలనుకోను.’’
శృతిలో ఉంటే మేలు
మనిషిని పిచ్చివాడిని చేసేదాన్ని భక్తి అనలేం. మనిషిలోని విశ్వాసం అతని మానసిక దౌర్బల్యానికి కాక వికాసానికి దోహదం చేయాలి
` స్వామి వివేకానంద.
భౌతికమైన సుఖాలేవీ ఇవ్వలేని పరమానందాన్ని పొందడానికి రెండేరెండు మార్గాలున్నాయి...  దైవభక్తిని పెంచుకోవడం. ప్రపంచంపై పరిమితులు లేని ప్రేమను పెంచుకోవడం భౌతికమైన సుఖాలకు అలవాటు పడితే వ్యసనాలుగా మారుతాయి. దైవభక్తి కూడా ఇటువంటిదే. వ్యసనాలకు లోనైతే ఒళ్లు పాడవుతుంది. శ్రుతి మించిన భక్తి వల్ల పూనకం రావడం వంటి రుగ్మతలు ఏర్పడతాయి. అసాధ్యమైన కోరికలతో దైవపూజలు చేసేవారిలో డిమెంషియా, యాంగ్జయిటీ సమస్యలు, నిద్రలేమి వంటివి బాధపెడతాయి.
బాణామతి, చేతబడి వంటివి పూర్తిగా అశాస్త్రీయమని నిరూపణ అయింది. ఇవి చేసేవారి మానసిక స్థితి సరిగా ఉండదు. ఇటీవల కాలంలో వివిధ దోషాల నివారణకోసం పూజలు, హోమాలు వంటివి చేయడం గమనిస్తున్నాం. వందలు, వేల నుంచి లక్షల రూపాయల వరకూ వీటికోసం ఖర్చు చేస్తున్న వాళ్లు ఉన్నారు. వీటిని నమ్ముతున్న వారి మానసిక స్థితి సరిగా ఉండదు. తమకు దక్కవలసినదేదో దక్కలేదనే ఆరాటం పెరిగిపెరిగి ఈ దారి పడతారు. కోరిక తీరకపోతే మానసిక రుగ్మతలకు గురవుతారు. చివరకు డబ్బుపోయి శనిపట్టెనన్నట్లుగా తయారవుతుంది పరిస్థితి.
డబ్బిచ్చుకుని కొడితే దేవుడైనా దిగిరాడా అనే పెడధోరణి పెరుగుతోంది. డబ్బుతో పూజిస్తే దేవుడు కరుణించి గ్రహాల గతులను మార్చడు. ఎందుకంటే ఆయన దృష్టిలో అందరూ సమానులే. టైం రావాలంటాడు. ఉన్న డబ్బంతా దాచేసుకుని మొక్కుబడిగా, ముక్తసరిగా పూజించినా దేవుడు నీ కోరిక నెరవేర్చడు. ఎంచేతంటే ఆయనకీ నీలాగే రాగద్వేషాలు ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావు కదా మరి? సంపాదించిన ప్రతి రూపాయి దైవానుగ్రహం అంటే ఎంతోకొంత అంగీకరిస్తున్నావా.... అయితే ఖర్చు చేసే ప్రతిరూపాయీ సమర్పణ భావంతో చేసి చూడు.
భక్తిలో అతివాద ధోరణి మంచిది కాదు. అన్ని మతాలలోనూ సాత్విక ఆరాధన మంచిదనే సూచన ఉంటుంది. భక్తిలో అతి ధోరణి కూడా మంచిది కాదు. ఎక్కువ ఖర్చుపెట్టి పూజలు జరిపిస్తే, ఎక్కువసేపు ధ్యానం చేస్తే నీ కోరికలన్నీ మరుక్షణంలో నెరవేరిపోతాయనుకోవడం కల్ల. దైవమైనా కాలానికి బందీ.
మాట వింటారా...
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. దైవభక్తిలో మనిషికి దొరికే అంతిమ సమాధానం ఇదే. అందుకే చెడును చూడకు, వినకు, మాట్లాడకు అన్నాడు. అంటే దీనర్ధం నీ కళ్లెదురుగా జరుగుతున్నది చెడు అయితే కళ్లు మూసుకోమని కాదు. ఆ భావనతో చూడవద్దని. చెడు వింటున్నాననుకుంటూ చెవులు మూసుకోవడం కాదు. ఆ ఉత్సాహంతో వినవద్దని. ఒకరి  గురించి చెడును తలపోయవద్దని..... అది మాటగా ఎవ్వరికీ చెప్పొద్దని.
ఈ స్పీడు యుగంలో భక్తి మరింతగా మనిషిని అవిశ్రాంతికి గురి చేయడం విషాదకరంగా మారుతోంది. ఏ మతమైనా నిరాడంబరంగా ఉండమని చెబుతుంది. గర్వానికి దూరంగా ఉండమంటుంది. ఇవి మనం అలవాటు చేసుకోవాలి. మన చిన్నారులకు నేర్పాలి. ఆరోగ్యకరమైన అలవాట్లు ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటే వాటిలోని మంచిని గ్రహించవలసినదే. అది ఏమతంలో ఉన్నా సరే.
అస్తినాస్తి విచికిత్సతో దైవం ఉన్నాడా... లేడా అనే చింతన వృధా. ఏదో ఒకవాదాన్ని సుదృఢంగా నమ్మడం మంచిది. ఉన్నాడని నమ్మినప్పుడు, లేడని బలంగా అనిపించినప్పుడు కూడా సొంతలాభం కొంత మానుకుంటే అంతే చాలు.
ప్రలోభం వల్లనో, అజ్ఞానం వల్లనో చిన్న వయస్సులోనే సన్యాసం స్వీకరించి తప్పటడుగులు వేసేవారిని చూస్తున్నాం. సాంసారిక జీవితం ఆవశ్యకత బోధించండి. అలాగే వివాహానికి ముందే శృంగార సుఖాల కోసం అర్రులు చాచే పిల్లలకు క్రమశిక్షణ ఆవశ్యకత తెలియచెప్పండి.
ఏకాగ్ర చిత్తంతో ఏ పని చేసినా అది తపస్సు వంటిదే. దానికి ఏమతంతోనూ సంబంధం లేదు. చేసే పనిని అవిశ్వాసంతో, అపనమ్మకంతో చేయడం కంటే మానుకోవడం ఉత్తమం.

No comments:

Post a Comment