28 October 2012

ఆహారపు అలవాట్లు


మనసుపై ప్రభావాలు
పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు. మీరు తీసుకునే ఆహారం, మీరు ఆహారం తీసుకొనే విధానం మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తాయంటే అతిశయోక్తి కాదు. శృంగారం, భోజనం, డ్రైవింగు ఈ మూడిరటిలో మనిషి వ్యవహారశైలి అతని వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుందని చెబుతారు. అందుకే కలసి భోజనం చేయడమనేది సాటిమనిషికి మనమిచ్చే గౌరవంగా భావించడం ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్కృతులలోనూ ఉంది.   మారుతున్న జీవనశైలి దేశప్రజల ఆహారపు అలవాట్లలో పెనుమార్పులు తీసుకువచ్చింది. అయితే ఆధునికమానవుడు, ముఖ్యంగా ఉన్నతవిద్యావంతులు ఆహారానికీ, మనసుకూ ఉన్న సంబంధాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.  శరీరాన్ని పోషించుకోవడానికే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా మంచి ఆహారపు అలవాట్లు అవసరం అనే సంగతిని విస్మరిస్తున్నారు. ఒత్తిడి, డిప్రెషన్‌ వంటి అనేక రకాల మానసిక రుగ్మతలకు ఆహారపు అలవాట్లే కారణమవుతున్నాయి.  


ఆహారము దాని ప్రభావము గురించి మాట్లాడుకోవాలంటే దాన్ని రెండు దశలుగా మాట్లాడుకోవాలి.
 ఏం తింటున్నాము? ఎలా తింటున్నాము? ఆధునిక వైద్యశాస్త్రం, నాగరికత ఏం తింటున్నాము అనేదానికి ఇచ్చిన ప్రాధాన్యత ఎలా తింటున్నాము అనే దానికి ఇవ్వడం లేదు.

నియమంగా చేసే భోజనం మనో వికాసానికి కారణమవుతుంది. మేధస్సును పెంచుతుంది.. ఆహారం పట్ల అలక్ష్యం, అశ్రద్ధ చూపిస్తే అది మనిషి పతనానికి కారణతీస్తుంది. ఆర్ధిక, సామాజిక, కుటుంబ పరిస్థితుల నేపధ్యంలో మనకు ఆహారపు అలవాట్లు ఏర్పడుతాయి. వ్యక్తిగత అభిరుచులు వీటికి మెరుగుదిద్దుతాయి.  దీర్ఘకాలంపాటు నియమరహితంగా వేళాపాళా లేకుండా ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదు. జీవితంలో తప్పక సాధించాలి అని మీరు అనుకునే లక్ష్యాల జాబితాలో మొదటిగా ఈ విషయం రాసుకోండి. ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించాలి.  పిల్లలకు చిన్నవయసునుంచే మంచి ఆహారపు అలవాట్లను నేర్పాలి. పెద్దవాళ్లు కూడా తమ పద్ధతులను మార్చుకోవాలి.
ఏం తినాలి?
ఎంత తక్కువ తిన్నా కార్బొహైడ్రేట్లు, కొవ్వు, ప్రొటీన్ల వంటివి శరీరానికి ఎక్కువ కేలరీలలో శక్తిని అందిస్తాయి. జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ స్లీప్‌ మెడిసిన్‌ వారు నిర్వహించిన ఒక సర్వేలో తేలిన విషయాలు ఇలా ఉన్నాయి. కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలను ఎక్కువగా తీసుకున్న వ్యక్తులలో పగటి సమయంలో అలసటను గుర్తించారు. ఒబేసిటీ సమస్యతో వారు బాధపడుతున్నట్లు గమనించారు. ఈ తరహా తిండిని ఎక్కువగా ఇష్టపడి తినే వ్యక్తులలో వ్యతిరేక భావనలు (నెగెటివ్‌ ఎమోషన్లు) ఎక్కువగా ఉంటాయట. వీరిలో తగిన వ్యాయామం చేయాలనే ఆలోచన ఉండదు. పనిపట్ల శ్రద్ధ తక్కువగా ఉంటుందని ప్రకటించారు. ఎక్కువ కేలరీలనిచ్చే ఆహార పదార్ధాలను తక్కువ మోతాదులోనే తినాలి.
పచ్చికూరలు, ఉడకబెట్టిన గింజలు వంటివాటిలో కేలరీలు తక్కువగానే ఉంటాయి. విటమిన్లు, మినరల్స్‌ ఎక్కువగా ఉంటాయి. నాడీ మండల వ్యవస్థను, మెదడు పనితీరును, వెన్నెముక పనితీరును బి12, బి6 వంటి విటమిన్లు ప్రభావితం చేస్తాయి. రోజూ తీసుకునే ఆహారంలో ఈ విటమిన్ల లోపం వల్ల, ఫ్యాటీ యాసిడ్స్‌ను అధికంగా తీసుకోవడం వల్ల  డిప్రెషన్‌కు లోనవుతారు. సమతుల ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. అందుకోసం ఏం తినాలి అనే ఆహార విజ్ఞానాన్ని ఎవరికి వారు తెలుసుకోవడం నేటి అవసరం.
ఆహారం మనసుపై చూపే ప్రభావం రెండు రకాలుగా ఉంటుంది. ప్రత్యక్ష ప్రభావం, పరోక్ష ప్రభావం.
ప్రత్యక్ష ప్రభావం అంటే ఆహారంలోని హార్మోన్లు, ఇతర రసాయనాల వల్ల మనకు ఉద్రేకాలు, ఉత్సాహాలు కలగడం. స్వీట్లు, చాక్లెట్లు తిన్నప్పుడు హాయిగా ఉండటం, కాఫీ, టీ, ఆల్కహాలు లాంటి వల్ల కలిగే ఉత్సాహం ఈ కోవకు వస్తాయి. పరోక్ష ప్రభావం అంటే ఆహారం వల్ల శరీరంలో మార్పు కలిగి, దాని వల్ల మన మనసులో వచ్చే మార్పులు. తిన్నది జీర్ణం కాకపోతే వచ్చే తలనొప్పి, చికాకు, కోపం ఈ కోవకు వస్తాయి.
నిజం చెప్పాలంటే మనసుకూడా  శరీరంలో ఒక అంగమే. అయితే ఇది శరీరంలోని మిగిలిన అంగాలను ప్రభావితం చేయగలదు. మిగిలిన అంగాలు అలా చేయలేవు. ఉదాహరణకు చేయికి నొప్పి కలిగితే దాని ప్రభావం, కాలి మీద, కంటి మీద ఉండదు. కానీ మనసు మీద ఉంటుంది. అలాగే మనసుకు నొప్పి కలిగితే అది చేయి కాలు కన్ను అన్ని అంగాల పరితీరునూ ప్రభావితం చేస్తుంది. కనుక శరీరం మీద ఆహారం చూపించే ప్రభావం మంచిదైనా చెడ్డదైనా అది మనసు మీద కూడా ఉంటుంది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏమంటే మనసు కు హాయిని కలిగించే ఆహారపదార్ధాలు, శరీరానికి హాయిని కలిగించకపోవచ్చు. స్వీట్లు, పచ్చిమిరపకాయ బజ్జీలు, ఆల్కహాలు, చిప్స్‌ ఇవన్నీ ఈ కోవకే వస్తాయి.
వాతావరణ ప్రభావం
ఆహారం అరుగుదలపై జీర్ణాశయ పనితీరు మాత్రమే కాకుండా వాతావరణ ప్రభావం కూడా కొంత  ఉంటుంది. చలిదేశాల్లో చపాతీలు తింటారు. మనవాళ్లు ఇడ్లీ, ఉప్మా చాలంటారు. కొంతమంది పిజ్జాలు, బర్గర్లు తింటారు. పూర్వం ఏ ప్రాంతంలో ఏ పంట విస్తారంగా పండితే అదే ఆహారం తీసుకునేవారు. అవి అక్కడి వాతావరణానికి అనుకూలంగా ఉండేవి. ఇప్పుడు ఆహార సంప్రదాయానికి కూడా సరిహద్దులు చెరిగిపోయాయి. అన్ని మల్డీక్యూజిన్‌ రెస్టారెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడో ఒకసారి సరదాకి బెంగాలీ వంటకాన్నో, చైనీస్‌ ఫుడ్‌నో సరదాకోసం తినొచ్చు. నచ్చింది కదాని ప్రతిరోజూ అదేపనిగా లాగించేస్తే ప్రమాదమే మరి. రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా వ్యవహరించాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఉంటూ వేరే ప్రాంతపు తిండి తినడం చెప్పదగిన సలహా కాదు. అలాగే ఏకాలంలో వచ్చే పళ్లు ఆకాలంలో తప్పనిసరిగా తినాలి. కూరగాయలైనా అంతే.
రుచి - అభిరుచి 
ఒమెగా`3 అనే ఫ్యాటీ యాసిడ్స్‌ శరీరానికి మేలుచేస్తాయి. మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ యాసిడ్స్‌ చేపల్లో ఎక్కువగా లభిస్తాయి. కాయగూరల్లో ఇవి లేకపోయినప్పటికీ ఆ యాసిడ్స్‌ చేసే మేలును కాయగూరలు కూడా చేసిపెడతాయని లబ్లిన్‌లోని మెడికల్‌ యూనివర్సిటీ ఒక పరిశోధనల్లో వెల్లడిరచింది. చేపలు, పచ్చి కాయగూరలు తినే వ్యక్తుల్లో అల్జీమర్‌ వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని డాక్టర్‌ ఎమ్‌.జె. డావిన్సీ  పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యానికి జింక్‌, కాపర్‌ మేలు చేస్తాయని అంటారు. వీటితో పాటు తాజా పళ్లు కూడా మానసిక ఆరోగ్యాన్ని కాపాడతాయంటారాయన. పీచు ఎక్కువగా ఉండే కాయగూరలు ఆరోగ్యానికి మంచివని శాస్త్రజ్ఞులు అంగీకరిస్తున్నారు.
ఎక్కడుంది రిస్క్‌?
శాకాహారం మంచిదా... మాంసాహారం మంచిదా? అనే విషయంలో విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే అవన్నీ ఎక్కువగా శారీరక ఆరోగ్యాన్ని గురించి ఎక్కువగా చర్చించాయి. మానసిక ఆరోగ్యంపై శాకాహారం, లేదా మాంసాహారం ప్రభావాన్ని గురించి పరిశోధనలు ఇంకా జరగవలసివుంది. 2008`12 సంవత్సరాల మధ్య జరిగిన ఒక పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. మాంసాహారులలో కంటే శాకాహారులలో డిప్రెషన్‌, యాంగ్జయిటీ, సొమాటోఫాం డిజార్డర్స్‌, సిండ్రోమ్స్‌, ఈటింగ్‌ డిజార్డర్స్‌ ఎక్కువగా వస్తున్నట్లు తేలింది. పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి శాకాహార మహిళలు, బాలికల్లో ఇవి ఎక్కువగా ఉంటున్నాయి. వీరి వ్యక్తిత్వాల్లో ఒకరకమైన నిరోధక తత్వం పెరుగుతూ వస్తోంది. అంటే పెర్‌ఫెక్షనిస్టులుగా ఉండడం, భావోద్వేగాలను, సెక్స్‌ కోరికలను అణిచిపెట్టుకోవడం, ఇతరులను విమర్శించడం, లేదా ఇతరులను చూచి భయపడడం వంటివి ఎక్కువగా ఉంటున్నాయి. ఇతరుల మెప్పుకోసం పాకులాడడం, ఫోబియాలు, పానిక్‌ డిజార్డర్ల వంటివన్నీ శాకాహారుల్లోనే ఎక్కువగా కనిపించాయట. అంతమాత్రం చేత శాకాహారం మంచిది కాదు అని తీర్పు చెప్పలేదు పరిశోధకులు. వివిధ ప్రాంతాల్లో ఆహారాన్ని పండిరచడానికి వాడుతున్న రసాయనిక ఎరువులు, అక్కడి వాతావరణ పరిస్థితులు, ఆర్ధిక, సామాజిక పరిస్థితులను అంచనా వేయలేదు. శాకాహారులు, మాంసాహారుల్లో వస్తున్న మానసిక సమస్యలపై ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనల్లో ఇది కొంచెం విస్తృత పరిధిగల పరిశోధన మాత్రమే.

శాకాహారంలో ఏముంది?     
శాకాహారాన్ని ఇష్టపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. శాకాహారులకు ఇష్టమైన మాట ఒకటి ఉంది. సాత్వికమైన ఆహారం తీసుకుంటే మనసు సాత్వికంగా, శాంతంగా ఉంటుంది. శాకాహారం అయినంత మాత్రాన అది సాత్వికాహారం అని చెప్పలేం. తేలికగా జీర్ణం కాగలిగిన ఆహారాన్ని మాత్రమే సాత్వికాహారంగా చెప్పాలి. ఘాటైన మసాలాలు, నూనెల వాడకం తగ్గించుకోవాలి. ఆరురుచుల్నీ సమపాళ్లలో తినడం నేర్చుకోవాలి. రోగం లేకపోయినా ఉప్పు, చక్కెర తగ్గించడం వంటి ప్రయత్నాల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు.  తరచుగా ఉపవాసాలు చేసే అలవాటు శాకాహారుల్లో ఎక్కువగా ఉంటుంది. ఉన్నదేదో తిందామనుకునే సర్దుబాటు ధోరణి మధ్యతరగతి ప్రజల్లో ఉంటుంది. ఆహారం కాకుండా వినిమయ వస్తువులను ఏర్పాటు చేసుకోవడానికి, ఇల్లు, పెళ్లి, విద్య వంటివాటికోసం తపించినట్లుగా, కష్టపడినట్లుగా మంచి ఆహారాన్ని తయారుచేసుకోవడం, సక్రమమైన తిండి అలవాట్లు నేర్చుకోవడం తప్పనిసరి అవసరంగా గుర్తించాలి. శాకాహారమే గొప్పదని చాలా పరిశోధనలు జరిగాయి. బ్రిటన్‌కు చెందిన డాక్టర్‌ బేరీ గ్రోవ్స్‌  శాకాహారుల్లో మెదడు కుంచించుకుపోవడం కనిపిస్తోందని చెబుతున్నారు. దీనికి కారణం మనదేశంలో అయితే శాకాహారుల్లోని ఆహార వినిమయ పద్ధతుల్లోని లోపమే అని చెప్పవచ్చు.

ద్రవాహారాలతో జాగ్రత్త!
మంచినీటిని మించిన మందులేదు. పోషకాహారం లేదు. కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు, తగుమోతాదులో పాలు, మజ్జిగ ఒంటికి మంచివే. కాఫీ, టీ, కూల్‌డ్రిరక్‌ల వంటివి మాత్రం అతిగా తీసుకోవద్దు. కాఫీలో ఉండే కెఫిన్‌ వల్ల అలర్ట్‌నెస్‌ పెరుగుతుంది. చిటికెలో అలసట తగ్గినట్లుగా అనిపిస్తుంది. అయితే దానికి పరిమితి ఉంది. రాత్రిపూట పనిచేస్తూ ఎక్కువ టీ, కాఫీలు సేవించడం మంచిది కాదు. ఎక్కువగా వీటిని తాగడం, లేదా ఒక్కసారిగా మానివేయడం వల్ల ప్రవర్తనా పరమైన సమస్యలు వస్తున్నట్లుగా గుర్తించారు. ఎక్కువగా తాగడం వల్ల యాంగ్జయిటీ డిజార్డర్‌, నిద్రా సమస్యల వంటివి ఏర్పడతాయి. ఒక్కసారిగా వీటిని మానివేయడం వల్ల జ్ఞాపకశక్తిపై ప్రభావం పడుతుంది. స్థూలంగా చూసినప్పుడు తెలివిగా కెఫిన్‌ను వినియోగించుకునే వ్యక్తులలో పాజిటివ్‌ మూడ్‌ డెవలప్‌ అవుతున్నట్లుగా తేలింది. అతిగా వినియోగించేవారిలో ముఖ్యంగా సెన్సిటివ్‌గా ఉండేవారిలో మానసిక ఒత్తిడి, ఇతర సమస్యలు తలెత్తుతున్నట్లు తేలింది. కూల్‌డ్రిరక్‌ల వినియోగం క్రమంగా తగ్గుముఖం పట్టడం కనిపిస్తోంది.
ఆహారం ` జ్ఞాపకశక్తి
ఐక్యూ టెస్ట్‌లో పాల్గొన్న విద్యార్ధుల్లో బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోని విద్యార్ధులు తక్కువ ప్రతిభ కనబరిచినట్లు పరిశీలనల్లో తేలింది. ఉద్యోగుల్లో అయితే చిరాకు, ఆందోళన ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది.   అమితంగా ఆహారం తీసుకుంటే మత్తు కలుగుతుంది. ఇది జ్ఞాపకశక్తిమీద ప్రభావాన్ని చూపెడుతుంది. ఇంకా జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్‌ ‘డి’, కాల్షియం, ఫాస్పరస్‌లు ఉపయోగపడతాయి. పాలు, జున్ను, చేపలు, గుడ్లు, వేరుశెనగ, బాదంపప్పు వంటివాటిలో ఇవి పుష్కలంగా దొరుకుతాయి. ఆహారాన్ని నియమిత సమయంలో తీసుకోవాలి. మంచినీరు, గాలి, పరిసరాలు కూడా అవసరం. మెదడు బాగా పనిచేయాలంటే... అధికంగా కొవ్వు పదార్ధాలను తినకూడదు. అలాగే మంచిగాలి పీల్చడం, ప్రాణాయామం చేయడం వంటివి చేయాలి.
ఆహారం - శృంగారం
శృంగారం మత్తు కలిగిస్తుంది. ఆహారం కూడా మత్తు కలిగిస్తుంది. రాత్రి భోజనానికి, శృంగారానికి మధ్య కొంత వ్యవధి ఉండడం మంచిది. కడుపు నిండుగా భోజనం చేసినవారు హడావుడి శృంగారానికి అలవాటు పడతారు. కడుపులో మంట పుట్టించే మసాలాలతో కూడిన భోజనం చేసినవారికి శృంగారం ఆనందాన్నివ్వదు. సంభోగానికి ముందు కొద్దిగా తీపి తినడం మంచిది. శృంగార సామర్ధ్యాన్ని పెంచేవస్తువులుగా చెప్పబడ్డవాటిని భార్యాభర్తలిద్దరూ ప్రేమతో కలిసి తినాలి. సామర్ధ్యాన్ని పెంచుతాయని చెప్పిన చాలా వస్తువులు శృంగారంలో యాంగ్జయిటీని కూడా పెంచుతాయి. తగుమోతాదులో తీసుకోవాలి.
ఫాస్ట్‌ఫుడ్‌ మాయాజాలం
‘‘టెన్షన్లో వాడు ఏం తింటున్నాడో... ఎంత తింటున్నాడో తెలియకుండా తినేస్తున్నాడురా’’ అనేది సినిమా జోకు. దీర్ఘకాలం పాటు ఒత్తిడికి లోనైన వారిలో అతితిండి కూడా కనిపిస్తుంది. ఇక ఫాస్ట్‌ ఫుడ్‌ సంస్కృతికి ఎక్కువగా బలవుతున్నవారిలో టీనేజ్‌ పిల్లలు ఉన్నారు. ఆడపిల్లల కంటే మగపిల్లల సంఖ్య మరీ ఎక్కువ. ఫ్యాట్‌ ఎక్కువగా ఉండే ఫాస్ట్‌ఫుడ్‌ తినడం అనేది కొకైన్‌ (మత్తుమందు) అలవాటు లాంటిది. ఒకరోజు తింటే ప్రతిరోజూ అదే సమయానికి కావాలనిపిస్తుంది. దీనివల్ల శారీరక ఆరోగ్యం పాడైపోవడం మాట అటుంచి మానసిక ఆరోగ్యానికి కూడా తీవ్రవిఘాతం కలుగుతుంది. న్యూట్రిషన్‌ రిసెర్చి అండ్‌ ప్రాక్టీస్‌ సంస్థ హైస్కూల్‌ పిల్లలపై జరిపిన పరిశోధనలో వెల్లడైన అంశం సంచలనం కలిగించేదిగా ఉంది. ఫాస్ట్‌ఫుడ్‌ తీసుకునే పిల్లల్లో ‘ఆలోచనాత్మక ఆచరణ’ (జూశ్రీaఅఅవస పవష్ట్రaఙఱశీతీ) అతి తక్కువ స్థాయిలో ఉందట. అంటే పిల్లల మానసిక ఎదుగలను ఫాస్ట్‌ఫుడ్స్‌ చంపేస్తున్నాయని అర్ధం. వారి ఆలోచనను అణగదొక్కేందుకు, రేపటితరం వివేకశూన్యులుగా మారేందుకు ఫాస్ట్‌ఫుడ్‌ వ్యాపారం పెనుభూతంలా పెరుగుతోందనే సత్యం అందరూ గ్రహించాలి.
ఒత్తిడిని తగ్గించే ఆహారపు అలవాట్లు ఇవీ...
మీరు తీసుకున్న ఆహారం విడుదల చేసే శక్తి మొత్తం జీర్ణవ్యవస్థకే చేరిపోతే ఇతర శరీర భాగాలు చురుకుగా పనిచేయడం మానేస్తాయి. అంటే తొందరగా అరగని ఆహారాన్ని హెచ్చుమొత్తంలో తీసుకోకూడదు. దీనివల్ల మెదడుకు, ఇతర శరీరభాగాలకు కావలసిన శక్తిని ప్రేగులు అందించలేవు. దీనివల్ల శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా ఒత్తిడి కలుగుతుంది. అందుకే ఒత్తిడిని కలిగించనివ్వని ఆహారపు అలవాట్లను చేసుకోండి. ఒత్తిడి తగ్గించే ఆహారపదార్ధాలలో ఇక్కడ ఇచ్చినవి కొన్ని ఉదాహరణలు....
1. ఫ్రూట్‌ సలాడ్‌
2. కాల్చిన రొట్టెలు ` వెన్న, నూనె లేకుండా
3. పచ్చికాయగూరలు
4. గ్రీన్‌ టీ
5. మొలకెత్తిన గింజలు
6. చేపలు.
కథ చెప్పుకుందాం....
అనగనగా ఓ రాజ్యంలో ఓ పేరుమోసిన వైద్యుడు ఉన్నాడు. ఎలాంటి తీవ్రమైన జబ్బునైనా చిటికెలో నయం చేస్తాడని అతగాడికి పెద్దపేరు. ఎక్కడెక్కడినుంచో రోగులు మందుకోసం అతని దగ్గరకు వచ్చేవారు. అందరికీ నయం చేసేవాడు. ఆ వైద్యుడికి పాపం ఓ తీరని కోరిక ఉంది. అదేమిటంటే... ఆ దేశాన్నేలే రాజుగారికి వైద్యం చేయాలని. చాలాసంవత్సరాల పాటు ఎదురుచూశాడు. కానీ ఫలితం లేకపోయింది. రాజుగారికి సరదాకోసం ఎప్పుడైనా జలుబు, జ్వరం లాంటివి కూడా రావడం లేదు.
రాజుగారి ఆరోగ్య రహస్యం ఏమిటీ అని వైద్యుడు ఆరా తీయించాడు. తేలిన విషయం ఏమిటంటే రాజుగారెప్పుడూ సరైన సమయానికి భోజనం చేస్తాడు. ఒక్క నిముషం అటూ ఇటూ కానివ్వడు. ఈ రహస్యం తెలుసుకున్న వైద్యుడు ఒక పన్నాగం పన్నాడు. రాజుగారికి స్నానం చేయించే సేవకుడికి లంచం ఇచ్చాడు. ‘‘ఈవేళ తలంటు కాస్త ఆలస్యం చెయ్యి’’ అని ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అనుకున్న ప్రకారం సేవకుడు పనివేగం తగ్గించాడు.  ఒంటికి నూనె పట్టిస్తూ కూర్చున్నాడు. రాజుగారికి భోజన వేళ అయింది. స్నానం పూర్తికావడం లేదు. రాజుగారు మరో ఆలోచన లేకుండా అక్కడున్న నలుగుపిండి తీసుకుని చక్కగా తినేశాడు. ఆయనకి ఎలాంటి జబ్బూ చేయలేదు. వైద్యుడికి పాపం అతని కోరిక నెరవేరలేదు. ఆహారం విషయంలో సమయపాలన ప్రాముఖ్యాన్ని తెలియచేసే ఈ కథ విశ్వనాథ సత్యనారాయణ గారి పురాణవైరి గ్రంధమాలలోనిది.
శ్రద్ధగా తినండి...
వేళకు భోజనం చేయండి. ఎప్పుడూ మానవద్దు. ఆ వేళకు ఉన్న ఆహారాన్ని నచ్చదనే పేరుతో తక్కువ తినడం కానీ, నచ్చితే ఎక్కువ తినడం కానీ చేయవద్దు.
ఫుడ్‌ డైరీ ఒకటి రాయండి. ప్రతిరోజూ మీరు తీసుకున్న ఆహారం, మీ ఫీలింగ్స్‌, పనితీరులో, బరువులో వచ్చిన తేడాలను అందులో నమోదు చేయండి.
రాత్రి 7 తర్వాత తినవద్దు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అయితే మితాహారం మేలు.
భోజనం పూర్తైన అరగంటకు మంచినీళ్లు తాగండి. రోజుమొత్తంలో ఎక్కువగా నీరు తాగండి.
బోరు కొడితే ఏదో ఒకటి నములుతూ ఉండడం కొందరికి అలవాటు. అంతకంటే బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌, ఇంకా ఏదైనా తేలికపాటి వ్యాయామం వంటివి చేయండి.
పనిచేస్తూ తినవద్దు. డ్రైవింగ్‌ చేస్తూ ఏదో ఒకటి తినడం ప్రమాదం. టీవీ చూస్తూ అన్నం తినడం అనర్ధం.
ప్రతిరోజూ ఒకే మోతాదులో తినాలి. మీరు ఏ మోతాదులో తింటే మీకు బాగుంటుందో మీ డైరీయే మీకు చెబుతుంది.
డైటింగ్‌ పాటిస్తున్నవాళ్లు న్యూట్రిషనిస్టుల పర్యవేక్షణలోనే చేయాలి.
సక్రమమైన తిండి అలవాట్లు చేసుకోవడం అనేది మీ లైఫ్‌స్టైల్‌ను మారుస్తుందని, అది మీ శక్తిసామర్ధ్యాలను పెంచుతుందని, శారీరక, మానసిక ఆరోగ్యానికి ఇది అత్యవసరమని బలంగా నమ్మండి.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చేసుకోండి.
తిండికి తగిన వ్యాయామం చేయడం తప్పనిసరి.
సరైన విరామాలు పాటించండి. తిండి తీసుకునే వేళల మధ్య కనీసం 4 నుంచి 5గంటల తేడా ఉంటే మంచిది.
కడుపులో ఆహారం అరిగేదాకా మళ్లీ తినడం మంచిది కాదు. నీరసం వచ్చి పడిపోయేదాకా తినకపోవడం అసలుకే మోసం తెస్తుంది.

No comments:

Post a Comment