28 October 2012

ఆడవాళ్లూ - టీవీ సీరియళ్లూఆంధ్రప్రదేశ్‌లో ఆ మాటకొస్తే భారతదేశంలో ఆడవాళ్లు టీవీ సీరియళ్లు చూడకుండా ఉండలేరనీ, ప్రతిరోజూ నిర్ణీత సమయానికి సీరియళ్లు చూడటం వారికి ఒక వ్యసనమయిపోయిందనీ, స్త్రీల జీవితంలో టీవీ సీరియళ్లు అనివార్య అవిభాజ్యఅంగాలై పోయాయనీ ఒక విశ్లేషణ, ఒక ఫిర్యాదు. ఒక ప్రచారం. ఇలా ఎందుకంటున్నామంటే అందరూ నిజమనుకొనే చాలా అంశాలు నూరు శాతం సత్యాలు కానట్లే, ఇది కూడా నూరుశాతం సత్యం కాదు.

ఆడవాళ్లకు టీవీ సీరియళ్లు చూడటం వ్యసనంగా మారిపోయిందిఅనే వాక్యం పైకి కనిపించేంత సామాన్య వాక్యం కాదు. దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ఆడవాళ్లకు మానసికంగా  ఉన్న ప్రత్యేకతలనూ, కుటుంబంలోనూ సమాజంలో వారికున్న ప్రత్యేకస్థానాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే టీవీలు కుటుంబం మీదా, వ్యక్తుల మీదా వాటి ప్రభావాన్ని అవగాహన చేసుకోవాలి. ఏది వ్యసనం?ఏది అలవాటు? ఏది కాలక్షేపం? ఏది వినోదం లాంటి ప్రశ్నలకు కూడా మనం నిర్దుష్టమైన సమాధానాలు చెప్పుకోవాలి. ఇలా విడివిడి అర్థాలూ, ప్రత్యేకతలూ తెలుసుకున్నాక ఈ మూడిరటి సంయుక్త ఫలితాలను విశ్లేషించాలి. ఇదంతా తేలిక కాదు. అలా అని సామాన్యులకు సాధ్యం కాని, అర్థం కాని బ్రహ్మ పదార్థమూ కాదు. కావాల్సిందల్లా తొందరపడి ఒక నిర్ణయానికి రాకుండా, ఓపికగా ఒక అంశం యొక్క అన్ని కోణాలూ పరిశీలించడం. దీనికి కొంత సామాజిక పరిశీలన, మరికొంత కామన్‌ సెన్సూ జతచేయాలి. అంతే..
ఈ విశ్లేషణను మొదటిగా
ఆడవాళ్లు టీవీలో సీరియళ్లు చూడకుండా ఉండలేరుఅనే వాక్యంలో నిజమెంత? అనే ప్రశ్నతో ప్రారంభిద్దాం.
పై వాక్యం తాత్పర్యం ఏమిటి? దీని తాత్పర్యం టీవీ సీరియళ్లు చూసే వ్యసనం ఆడవాళ్లకు మాత్రమే ఉందిఅనుకుంటే ఇది పూర్తిగా నిజం కాదు. సీరియళ్లు వచ్చే సమయంలో ఖాళీగా ఉండే మగాళ్లూ, పిల్లలూ కూడా సీరియళ్లను చూడదానికి అలవాటుపడటం మనకు తెలుసు. ఫలానా సమయానికి ఫలానా సీరియల్‌ చూడాలని అందరూ ఎదురుచూడటం, ఆ సమయానికి కరెంటు పోతే లక్షలు నష్టపోయినట్లు బాధపడటం కూడా మనం చాలా ఇళ్లల్లో చూస్తున్నాం. కనుక స్త్రీలు మాత్రమే సీరియళ్లు చూస్తున్నారు అనేది నిజం కాదు. సీరియళ్లు చూసేవాళ్లల్లో స్త్రీలు ఎక్కువగా ఉంటున్నారంతే.
ఆడవాళ్లు వాళ్ల రోజువారీ పనులు మాని టీవీ చూస్తున్నారుఅనే అర్థాన్ని తీసుకొని చూద్దామనుకున్నా అదీ నిజం కాదు. టీవీ చూసేందుకు వీలున్న ప్రైమ్‌ టైం లో వేస్తున్న సీరియళ్ళకే ఎక్కువ ప్రేక్షకాదరణ ఉండటం, మిగిలినవాటికి అంత ఎక్కువమంది వీక్షకులు లేకపోవడం అందరికీ తెలిసిందే. అంటే పని మానుకొని టీవీ చూసే వాళ్ల కన్నా, ఖాళీ సమయంలో టీవీ చూసేవాళ్లే ఎక్కువన్నమాట. అసలు ఆడవాళ్లు ఇంటిపని మానుకొని టీవీ సీరియళ్లు చూడటమే నిజమైతే చాలా కుటుంబ జీవితాలు స్తంభించిపోయేవి. సమాజం ఇప్పటికే అల్లకల్లోలం అయిపోయేది. కనుక మహిళలు ఇంటి పని మాని టీవీ సీరియళ్లు చూస్తారనేది ఒక అపోహ, దుష్ప్రచారం మాత్రమే. 
ఆడవాళ్లు టీవీ చూస్తే సీరియళ్లు చూస్తారు, మగవాళ్ళైతే క్రికెట్టూ, న్యూసూ చూస్తారు. పిల్లలు కార్టూన్లు, జోకులు, పాటలు చూస్తారు అని వాక్యానికి తాత్పర్యం చెప్పుకుంటే నిజానికి కొంచెం దగ్గరగా వస్తాం. ముందే అనుకున్నట్లు ఇది పూర్తి నిజం కాదు. సీరియళ్లు చూసే మగవాళ్లూ, క్రికెట్‌ చూసే ఆడవాళ్లూ కూడా తగు సంఖ్యలో ఉన్నారు. పిల్లలు అన్నీ చూడటానికి సిద్ధంగా ఉంటారని మనకు తెలిసిందే.
అయితే ఎవరు ఎన్ని చెప్పినా మహిళలకు కుటుంబ కలహాలూ అత్తా కోడళ్ల తగాదాలు కథాంశాలుగా    ఉండే టీవీ సీరియళ్లు చూడటం అంటే ఆసక్తి అని మనకు తెలుసు.
దీనికి కారణాలు చెప్పుకొనే ముందుగా మనం కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవి
(అ) మహిళలు ` ప్రత్యేకతలు
మానసికంగా సామాజికంగా మహిళలకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వివిధ సంఘటనలకు మగబాళ్లు స్పందించే తీరు, మహిళలు స్పందించే తీరూ భిన్నంగా ఉంటుంది. కుటుంబంలోనూ, సమాజంలోనూ కూడా స్త్రీలు పురుషులకు భిన్నమైన బాధ్యతలు, పాత్రలు ఉంటాయి. పూర్వకాలంతో పోల్చినప్పుడు పరిస్థితులు మారుతున్నా, ఇప్పటికీ మన సమాజంలో పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలకు సామాజిక జీవితం తక్కువగానే         ఉంటోంది. వారి ప్రపంచం కుటుంబం, బంధువులు, స్నేహితులు, సహోద్యోగులకు పరిమితమౌతోంది. ఒక మాదిరి పట్టణాల్లోనూ, నగరాల్లోనూ అయితే ఇరుగు పొరుగుతో పరిచయాలు, స్నేహాలూ కూడా నామమాత్రంగా ఉంటున్నాయి.
ఉద్యోగం చేసే మహిళలు రోజూ ఇంటిలోంచి  బయటకు వెళ్లి బయట ప్రపంచాన్ని చూసినావీరికి కూడా ఆ ప్రపంచంతో ఇంటర్‌యాక్ట్‌ అయ్యే అవకాశం పరిమితంగానే ఉంటోంది. ఆఫీసులో ఎంత పని చేసినా ఇంటిపనిలో కీలకభాగం ఆడవాళ్లే నిర్వర్తించాల్సి రావడం వల్ల సమయాభావం, మానసిక ఒత్తిడీ పెరుగుతున్నాయి. చుట్టుపక్కల సమాజంలో ఏం జరుగుతోందో తెలుసుకొనేందుకు పత్రికల మీదా, కుటుంబ సభ్యుల మీదా, టీవీల మీదా ఆధారపడక తప్పడం లేదు.
సాధారణంగా కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు వ్యక్తిగత, కుటుంబ సంబంధ విషయాలకు పరిమితమై       ఉంటాయి. వృత్తిపరమైన విషయాలు చర్చించడం చాలా తక్కువగా ఉంటుంది. మన చుట్టుపక్కల సమాజంలో జరిగే వివిధఅంశాలకు సంబంధించిన కుటుంబ సభ్యుల మధ్య చర్చ జరగడం అనేది అరుదుగా ఉంటుంది. సామాజికాంశాలకు సంబంధించి మహిళలకు కుటుంబ సభ్యులనుంచి వచ్చే సమాచారం అనేక కారణాల వల్ల పరిమితంగా ఉంటుంది. ఈ విషయాలు పత్రికల ద్వారా తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవడంలో తగినంత ఆసక్తి అభిరుచీ ఉండాలి. పైగా ఇది ప్రత్యేకించి సమయమూ, ధనమూ వెచ్చించి చేయాల్సిన పని. ఈ కారణాల వల్ల టీవీ మాత్రమే ఆడవారికి బయటి ప్రపంచ సమాచారానికి ద్వారంగానో, కిటికీగానో, అద్దంగానో ఉపయోగపడుతోందనడంలో అతిశయోక్తి లేదు.
ఆడవాళ్లూ, టీవీ సీరియళ్లూ అనే అంశంలో సాధారణంగా ఉద్యోగం చేయకుండా ఇంటిపనులు చేసుకొనే మహిళలనే మనం పరిగణనలోకి తీసుకుంటున్నాం.  గత పది పదిహేనేళ్లల్లో టీవీ చూడటమే కుటుంబ మహిళలకున్న ఏకైక హాబీగా మారిపోయింది. ప్రపంచీకరణ విజృంభణతో ప్రతి ఇంట్లోనూ టీవీ అనేది కనీసావసరంగా మారిపోవడం, టీవీ ఛానళ్ల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం ఈ కాలంలో జరిగినవే. మారుతున్న సమాజంలో వేగంగా వస్తున్న మార్పులను పత్రికలకన్నా ఎక్కువగా ప్రతిఫలించింది టీవీనే అని చెప్పవచ్చు.
ప్రస్తుతం గత రెండుమూడేళ్లుగా దేశం ఎదుర్కొంటున్న ఆర్థికమాంద్యం  వల్ల పరిస్థితులలో కొంత మార్పు వస్తోంది. ఉద్యోగాలు చేయకుండా ఇంట్లో ఉండే స్త్రీలు కూడా ఏదో ఒక ఆర్థికంగా లాభదాయకమైన హాబీని అలవరువరుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయినా టీవీ సీరియళ్ల మీద ఆసక్తి తగ్గాల్సినంతగా తగ్గడంలేదు. ఈ విషయాన్ని మనం మరింత లోతుగా అర్థం చేసుకోవాలంటే  టీవీ ప్రపంచంలో ఎందుకు ప్రజాదరణ పొందిన వినోదసాధనంగా మారిందో మనం గమనించాలి.
(అ) మన ఇంట్లోనే ఉంటుంది. మనం దానికోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన పనిలేదు.
(ఆ) ఒకసారి కొనడానికి అయ్యే ఖర్చును తీసేస్తే నిర్వహణావ్యయం చాలా తక్కువ. తక్కువ ఖర్చుతో ఎక్కువ సమయం కాలక్షేపం చేసే అవకాశం టీవీలోనే ఉంది.
(ఇ) ప్రత్యేకంగా ఏకాగ్రత, శ్రద్ధ పెట్టాల్సిన పని కూడా లేదు. దృశ్యమాధ్యమం కనుక సంభాషణ అర్థం కాకపోయినా విషయం తెలుస్తుంది. మధ్యలో కొంత సేపు దృశ్యం చూడకపోయినా మాట వినబడుతూంది కనుక కంటిన్యుటీ ఉంటుంది. కనుక కళ్లకే తప్ప మెదడుకు శ్రమ తక్కువగా ఉంటుంది.
(ఈ) ఇది కాక ప్రత్యక్ష ప్రసారాల వలన ఉత్కంఠ, ధ్రిల్‌ ఫాక్టర్‌ దీనికి అదనంగా చేరతాయి. ఎప్పుడో జరిగిపోయినదాన్ని చూస్తున్నామన్న భావన కన్నా, ఇప్పుడు మన కళ్ల ముందు జరుగుతున్నదానకి మనం ప్రత్యక్షసాక్షులుగా ఉన్నాం అనే భావన ఒక విధమైన సంతృప్తిని ఇస్తుంది. మనకున్న ఆర్థిక పరిమితులు, ఇతర పరిమితుల వల్ల మనం అనేక వినోదాలను మిస్సవుతామనే ఫీలింగు మనకి లేకుండా చేస్తుంది.
తక్కువ ఖర్చులో ఎక్కువ సమయం అందుబాటులో ఉండటం, ఆలోచించాల్సి అవసరం తక్కువగా                   ఉండటం, భాషాపరమైన నైపుణ్యాల అవసరం బాగా తక్కువగా ఉండటంతో వినోదమాధ్యమాలుగా పుస్తకాలు, పత్రికలు, సినిమాల స్థానాన్ని టీవీ ఆక్రమించింది.
మొదట్లో టీవీలను సమాచార ప్రసారాలకు మాత్రమే ఉపయోగించేవారు. రానురానూ టీవీ ప్రసారాల్లో నాణ్యతపెరిగింది. ప్రసారాలు చేయడానికి, టీవీ కార్యక్రమాలు తయారు చేయడానికి కావాల్సిన ఖర్చు తగ్గుతూ వచ్చింది. టీవీ వార్తాప్రసారాల సాధనం, సమాచార మాధ్యమం పాత్ర నుంచి వినోద మాధ్యమం పాత్రకు మారిపోయింది. వారపత్రికల్లో సీరియళ్లు ఆదర్శంగా టీవీలోనూ వారానికి ఒక సారి ప్రసారమయ్యే సీరియళ్లు మొదలయ్యాయి. మన దేశంలో రామాయణం టీవీ సీరియల్‌ పొందిన ప్రజాదరణ టీవీ చరిత్రలోనే ఒక పెద్ద మైలురాయి.
తర్వాత తరంలో టీవీలలో సాంకేతికత మరింత పెరిగింది. కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌ రంగం విజృంభించడంతో టీవీ కార్యక్రమాల నిర్మాణంలో వేగం పెరిగి, ఖర్చు తగ్గింది. దీనితో డైలీ సీరియల్‌ ప్రయోగం ప్రారంభమయ్యింది. దూరదర్శన్‌లో  ఋతురాగాలు  సీరియల్‌ సాధించిన విజయం టీవీ సీరియళ్ల ప్రస్థానాన్నే మార్చివేసింది. 
అవి అంతలేకుండా ఏళ్ల కొనసాగటం, అత్తాకోడళ్ల తగాదాలు, ఫామిలీ డ్రామాలు సీరియల్‌ సబ్జెక్టులుగా మారింది ఆ తర్వాతే. అంతకు పూర్వం సీరియళ్లు ప్రాచుర్యం పొందిన నవలల ఆధారంగా తీసేవారు.
కుటుంబ తగాదాల సీరియళ్లు, ఆడవాళ్లే ప్రధాన పాత్రధారులుగా, ఆడవాళ్లే ప్రధాన విలన్లుగా ఉన్న సీరియళ్లు ఎందుకు ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలంటే అసలు మనకు కొన్ని విషయాలమీద ఎందుకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది? కొన్నిటిమీద ఎందుకు ఆసక్తి తక్కువగా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి.
ఈ కింది అంశాలను పరిశీలించండి
(అ) ఎవరికైనా తమకు తేలికగా అర్థమయ్యే వాటి మీద ఆసక్తి ఉంటుంది. అర్థంకాని విషయం ఎంత ప్రయోజనకరమైనదైనా ఆసక్తి తక్కువగానే ఉంటుంది.
(ఆ) ఏపనైనా రోజూ చేస్తూ ఉంటే దాని మీద ఆసక్తి పెరుగుతుంది. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే ఏదైనా పనిని చేయగా చేయగా అలవాటవుతుంది. బలవంతంగానైనా సరే  కొద్ది రోజులు ఒక పనిని అంతరాయం లేకుండా చేయించితే ఆ పని మీద ఆసక్తి పెరుగుతుంది,
(ఇ) మన జీవితానికి లేదా మానసిక పరిస్థితులకు సంబంధం ఉన్న, దగ్గరగా ఉన్న వ్యక్తులు, సంఘటనలు, సన్నివేశాల పట్ల మనకు ఆసక్తి సహజంగా ఉంటుంది.
(ఈ) సామాన్య మధ్యతరగతి మానవులు తాము ఆచరణలో సాధించలేని డబ్బు, హోదా , అధికారం ఇలాంటి భౌతికసంపదలు వినోద మాధ్యమాలలో చూసి, ఊహించుకోవడాన్ని ఇష్టపడతారు. డబ్బూ, హోదా, అధికారంలో ఉన్న వారి జీవితవిధానాలు, అలవాట్లు, వ్యవహారశైలి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది.
మనం చర్చిస్తున్న కుటుంబ సంబంధాల టీవీ సీరియళ్లకు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. కనుక ఇవి మహిళా ప్రేక్షక లోకానికి ఆసక్తిదాయకంగా ఉండటంలో ఆశ్చర్యంలేదు.
పైన పేర్కొన్న వివిధ అంశాలు కాక మరికొన్ని అంశాలు కూడా ఆడవాళ్లు టీవీ సీరియళ్ల వైపు ఆసక్తి చూపడానికి కారణమౌతున్నాయి.
(అ) సీరియళ్లలోని స్త్రీ పాత్రల దుస్తులు, అలంకరణలు ఆడవాళ్లను ఆకర్షిస్తాయి, ఇవాళ ఏం చీర కట్టుకుంది? ఎలాంటి ఆభరణాలు ధరించింది అనే ఆసక్తితో కూడా సీరియల్స్‌ చూస్తారు.
(ఆ) సీరియళ్లలోని వివిధ పాత్రలను తమ జీవితంలోని వ్యక్తులతో పోల్చుకోవడం సాధారణం. మంచివారిని మనకిష్టమైన వారితోనూ, విలన్లను మనకిష్టం లేనివారితోనూ పోల్చుకొని సంతృప్తిపడటం సహజమైన మానసిక పరిణామం. ఇలా పోల్చుకోవడం వల్ల ఆ పాత్ర మీద ఆసక్తి పెరిగి సీరియల్‌ను చూడకుండా ఉండలేని స్థితి వస్తుంది. 
(ఇ) కుటుంబంలోని వ్యక్తులతో మనసులోని అనుభూతులు పంచుకోలేని స్థితిలో కూడా సీరియళ్లలో పాత్రలు ఆత్మబంధువుల్లా అనిపిస్తాయి. భర్తా, పిల్లలూ తీరికలేకుండా ఉండే కుటుంబాలలో గృహిణులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు.
పర్యవసానాలు:
టీవీ ఎక్కువ సేపు చూడటం వల్ల సమయం వృధాకావడం మొదటి నష్టం. ఈ ఒక్క అయిదు నిమిషాలూ చూద్దాం, బ్రేక్‌ వరకూ చూసి లేద్దాం అనుకుంటూ మొత్తం సీరియల్‌ అయ్యేవరకూ చూడటం ఒక ఆనవాయితీ. టీవీ చూస్తూ పని చేసుకుంటున్నామని అనుకున్నా. కనీసం టీవీ ఆన్‌ చేసి ఉన్న సమయంలో 50శాతం వృధా అవుతుందని ఒక అంచనా. పూర్తిగా పని ఆపేసి కూర్చుని చూడటం ఒక విధమైతే, పని చేస్తూ టీవీ చూడటం వల్ల పని సామర్థ్యం, నాణ్యతా దెబ్బతినడం ప్రధాన సమస్య.
టీవీ వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బతినడం మరో ప్రధాన సమస్య. ఒకరితో మాట్లాడుకోవడానికి తగినంత సమయం కేటాయించకపోవడం టీవీ ఎక్కువగా చూడటం వల్ల కలిగే పర్యవసానమే. కుటుంబ సభ్యుల మాటల కన్నా సీరియల్లో మాటలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఎపిసోడ్‌ అయిపోతే, మళ్లీ రాదు, అదే కుటుంబ సభ్యులతో తర్వాత మాట్లాడవచ్చు అనుకుంటాం. కానీ ఆ తర్వాత అనేది అంత తొందరగా రాదు. బయటకు వెళ్లొచ్చిన భర్తా పిల్లలూ కూడా టీవీ ముందు కూర్చుంటారు. రాత్రి అందరూ కలసి ఉండే సమయంలో  అధిక భాగం అందరూ కలసి టీవీ చూడటంతోనే సరిపోతుంది. ఒకరి అనుభవాలు, అనుభూతులు మరొకరితో పంచుకొనే అవకాశం ఉండదు. ఇది మానసికంగా అనుబంధాలను బలహీనం చేస్తుంది. ఇదంతా ఒక వైపు.
మరోవైపు ఏ ఛానల్‌ చూడాలి, ఏ ప్రోగ్రాం చూడాలి అనేదానిమీద కుటుంబాలలో వివాదాలు తలెత్తుతాయి. పక్కన ఉండి చూస్తే చాలా చిన్న విషయం అనిపించే ఈ విషయాలు, మనం వివాదంలో భాగస్వాములం అయినప్పుడు మాత్రం చాలా సీరియస్‌ విషయాలుగా అనిపిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను చెడగొడతాయి.
టీవీ చూడటం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. టీవీ యొక్క దుష్ప్రభావం అటు శారీరక ఆరోగ్యం మీదా, ఇటు మానసిక ఆరోగ్యం మీదా ఉంటుంది. ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం, చిరుతిళ్లు తినడం, వల్ల ఊబకాయం, అధికబరువు సమస్యలు వస్తాయి. టీవీల్లో పాత్రలతో పాటు ఉద్వేగాలకు లోనుకావడం వల్ల అనవసరంగా బీపీ రావడం, ఆనవసరంగా హార్మోన్లు విడుదల కావడం వలన వచ్చే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఇక మానసిక ఆరోగ్యంపై టీవీ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. టీవీలు, సీరియళ్లు చూడటం వల్ల రెండు రకాల ముఖ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఒకటి సహనం ఫూర్తిగా నశించడం. టీవీలో మధ్యలో ప్రకటనలు వచ్చినప్పుడు వేరే ఛానల్స్‌కు సెర్చ్‌ చేయడం. పక్కవాళ్లు ఎవరైనా మధ్యలో ఛానల్‌ మారిస్తే వాళ్ల మీద విరుచుకుపడటం, మధ్యలో కరెంటు పోతే తీవ్ర అసహనానికిలోనుకావడం ఈ లక్షణాలు సహనశక్తి తగ్గిపోవడాన్ని సూచిస్తాయి.
రెండో రకం సమస్య స్పందన తగ్గిపోవడం. టీవీల్లో హింసనూ, దుఃఖాన్ని చూసి చూసి క్రమంగా అలవాటు పడి వాటికి స్పందించడం తగ్గిస్తాం. కానీ అదే అలవాటు నిజ జీవితంలోనూ కొనసాగుతుంది. ఎదుటి వ్యక్తి బాధనూ, దుఃఖాన్నీ తీవ్రంగా పరిగణించడం మానేస్తాం. చూడటానికి స్పందించడానికీ మధ్య తేడా పెరిగిపోతుంది. కుటుంబ సభ్యుల అనుభూతుల పట్ల, మన చుట్టూ సమాజంలోని సంఘటనల పట్లా స్పందన తగ్గిపోతుంది. మనకు ప్రత్యక్షంగా నష్టం జరుగుతుందని మనం భావించినప్పుడే మనం స్పందించటం లేకపోతే మానేయడం జరుగుతోంది.
పై రెండు మానసిక లక్షణాలనూ కలసి చూసినప్పుడు కొన్ని విషయాలకు అనవసరంగా తీవ్రంగా స్పందించడం, కొన్ని విషయాలకు అసలు స్పందిచకపోవడం జరిగి అవి తీవ్రమైన మానసిక సమస్యలకు దారి తీస్తున్నాయి.
టీవీ సీరియళ్లలో జరిగే కధలలో సన్నివేశాలలో తర్కం కన్నా ఊహ, ఉద్వేగాలూ ఎక్కువగా  ఉంటాయి. ఇది ఆచరణలో సాధ్యమా, సాధ్యంకాదా అనే ఆలోచనకు తావుండదు. ఒక అమ్మాయికి, ఒక అబ్బాయి ఎందుకు నచ్చాడో, ఎందుకు నచ్చలేదో అనే మానసిక ఆంశాల నుండి, అకస్మాత్తుగా కోటీశ్వరులు కావడం, తేలికగా స్నేహసంబంధాలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, పగతీర్చుకోవడం కోసం దేనికైనా సిద్ధపడటం ఇలాంటివి సీరియళ్లలో సహజంగా ఉండే సన్నివేశాలు. అసలు ఈ ప్రేమించేవారికీ, పగతీర్చుకొనేవవారికీ పొట్ట ఎలా నిండుతుంది, వారి వృత్తి                        ఉద్యోగజీవితాల పరిస్థితి ఏమిటి? ఇలాంటి కీలకమైన అంశాలను సీరియళ్లలో చూపించరు. నిజ జీవితంలో మనకు కోపం వచ్చినా, దుఃఖం వచ్చినా ఆవేశం వచ్చినా అది ఎక్కువకాలం కొనసాగే అవకాశం ఉండదు. పొట్టతిప్పల కోసం చేయాల్సిన వృత్తి ఉద్యోగాలకు, వ్యాపారాలకు  తప్పనిసరిగా సమయం కేటాయించాల్సి ఉంటుంది. కానీ టీవీ చూసేవాళ్లల్లో ఊహకూ వాస్తవానికీ ఉన్న బేధాన్నీ చూసే శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల నిత్య జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకొనే శక్తి సన్నగిల్లుతుంది.
టీవీ సీరియళ్లు చూసే అలవాటు వల్ల తలెత్తే వివిధ సమస్యలను ఇప్పటివరకూ చర్చించాం.
ఈ సమస్య నుంచీ, దాని వల్ల ఫలితాల నుంచి ఎలా బయటపడాలి అసలు సమస్యలో చిక్కుకోకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.
(అ) టీవీ చూడటం సాధ్యమైనంత తగ్గించి ఇతర కాలక్షేపాల వైపు మొగ్గు చూపాలి.
(ఆ) రోజూ కుటుంబ సభ్యులతో కొంత సేపు (టీవీ లేకుండా) సమయం గడపాలి. అందరూ కలసి ఒకేసారి గడపడం వీలుకాకపోతే వేర్వేరు సమయాలు కేటాయించుకొని  ఆ సమయంలో అందుబాటులో ఉన్న ఇద్దరు ముగ్గురు కలసి పనిచేసుకోవాలి, ఇలా పని చేసుకుంటూ కుటుంబ విషయాలు, వృత్తులలో కలిగే అనుభవాలు ఒకరితో ఒకరు పంచుకోవాలి. ఎదుటి వారు చెప్పేదాన్ని పూర్తిగా వినాలి? మధ్యలో ప్రశ్నించకూడదు. మధ్యలో కానీ ఆ తర్వాత కానీ కామెంట్‌ చేయకూడదు. ఒకవేళ అవతలి వాళ్ళు మీ అభిప్రాయం అడిగితే  ప్రత్యేకించి అడిగిన అంశం మీద మాత్రమే అభిప్రాయం చెప్పాలి, నువ్వెప్పుడూ ఇంతే అని వ్యక్తుల మీద అభిప్రాయాలు ప్రకటించకూడదు.
(ఇ) టీవీ సీరియళ్లను చర్చిస్తున్నప్పుడు నిజ జీవితంలో అయితే ఆ పాత్ర అలా ప్రవర్తించే అవకాశం ఎంత వరకూ ఉంది? ఆ సమస్యకు ఎన్ని రకాల పరిష్కారాలు ఉంటాయి? అని చర్చించాలి? టీవీల్లో వేసే  పోటీ కార్యక్రమాలు నిజంగా పోటీలు కావనీ ఎవరు ఏం మాట్లాడాలో, ఎవరు ఏం చేయాలో, ఎవరు ఏం పాటపాడాలో ముందే నిర్ణయం అయిపోయి ఉంటుందనీ తెలుసుకోవాలి.
(ఈ) ప్రయత్న పూర్వకంగా కొన్ని భాగాలు సీరియల్‌ చూడటం మానేయాలి. దాన్ని గురించి ఇతరులను అడగటం, చర్చించడం చేయరాదు. వారానికి ఒక రోజు ఇంట్లో టీవీ లెస్‌ డేపాటించాలి. ఆ రోజు టీవీ పూర్తిగా కట్టేయాలి.
అంతిమంగా టీవీలకు జీవితంలో పరిమిత స్థానమే ఇవ్వాలనే దృఢ నిశ్చయానికి రావాలి. నిజ జీవితం టీవీలో, సీరియల్లో చూపించేదానికంటే భిన్నంగా ఉంటుందని గుర్తించాలి. మీ వ్యక్తిత్వం మీద టీవీ, టీవీ సీరియళ్లలో పాత్రల ప్రభావం పడకుండా చూసుకోవాలనే అప్రమత్తత ఉండాలి.       

No comments:

Post a Comment