2 October 2012

మనో సాగర మథనంలో ౩౦యేళ్లు..

చదువు

సైకాలజిస్ట్‌ అనేపదం పదో తరగతిలో ఉండగా మొదటిసారిగా వినిపించింది. అప్పటికి ఈ సబ్జెక్టుపై దొరుకుతున్న సమాచారం తక్కువ. గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత కూడా సైకాలజీపై మమకారం పోలేదు. చదివిన పుస్తకాలు, ఆకళింపు చేసుకున్న సామాజిక సమస్యలు సైకాలజీ పట్ల నా మక్కువను  మరింతగా పెంచాయి. అన్నామలై యూనివర్సిటీ నుంచి సైకాలజీలోనే ఎమ్మెస్సీ చేశాను. మానవ సంబంధాలపై పిజి డిప్లొమో అందుకున్నాను.


కెరీర్

ప్రముఖ సెక్సాలజిస్ట్‌ డాక్టర్‌ జి. సమరం ప్రోత్సాహంతో ఆయన స్థాపించిన వాసవ్య నర్సింగ్‌ హోమ్‌లో సైకాలజిస్ట్‌గా నా కెరీర్‌ను ప్రారంభించాను. స్వతహాగా మైండ్‌గేమ్‌ అంటే ఆసక్తి నాకు. అదే నన్ను హిప్నాటిజం వైపు అడుగులు వేయించింది. మనసు చేసే తమాషాలు తెలుసుకోవాలనే ఉత్సాహం కొద్దీ స్టేజీలపై హిప్నాటిజం ప్రదర్శనలు ఇచ్చేవాడిని. మరోవైపు సమరం హేతువాద జట్టులో క్రియాశీలకమైన పాత్ర పోషించేవాడిని. చేతబడి, బాణామతి, దెయ్యాలు వంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవాడిని. ఆ క్రమంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువగా పర్యటించాను. ఇవి నారంగంలో నాకు మంచి అనుభవాన్ని తెచ్చిపెట్టాయి. ఈనాడు ఆధ్వర్యంలో అవగాహనా సదస్సులలో పాల్గొనేవాణ్ణి. నాటకాల ద్వారా మూఢనమ్మకాలను తగ్గించేందుకు మా బృందం ద్వారా ప్రయత్నించేవాళ్లం. ఈ కార్యక్రమాలన్నింటి వల్లా సమాజసేవ మాట అటువుంచి వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించే అంశాలెన్నో ఇందులో కనిపించాయి. అవన్నీ పాఠకులతో పంచుకోవడానికి కలం పట్టాను.

రచయితగా నా ప్రస్థానం

ఇరవై ఏళ్లకాలంలో వ్యక్తిత్వ వికాసంపై 40 పుస్తకాలను వెలువరించాను. పల్లవి, జెపి, విక్టరీ, మధులత, గౌతం వంటి పబ్లికేషన్‌ సంస్థల అధిపతులు ఎంతో ప్రోత్సాహమిచ్చి నా రచనలను ప్రచురించారు. నేను రచించిన 40 పుస్తకాలలో 30 పుస్తకాలు కన్నడ, ఇంగ్లీషు, పంజాబీ భాషల్లో   అనువాదమయ్యాయి. ఒత్తిడిని ఎదుర్కోవడం ఎలా? (స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌) అనే అంశంపై ఆడియో పాఠాలను రూపొందించాను. ఆంధ్రప్రదేశ్‌ కౌన్సిలింగ్‌ సైకాలజిస్టుల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా, విజయవాడ టాలెంట్‌ అకాడమీ ప్రెసిడెంట్‌గా కంటే కూడా రచయితగా నాకు ఎక్కువ సంతృప్తి దొరుకుతుంది. ఇందిరా ప్రియదర్శిని అవార్డు వంటివి వరించి వచ్చినప్పుడు కంటే నా పుస్తకాల ద్వారా నేను సాధించాల్సింది ఇంకా ఉందనిపిస్తుంది. రేడియో ప్రసంగాలు, టీవిలో ఫోన్‌ ఇన్‌ ప్రోగ్రాంల ద్వారానూ కళాశాలలు, క్లబ్‌లలో వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వివిధ ప్రాంతాలలోని ప్రజలతో మమేకమవడం నాకు ఆనందకరమైన విషయం. ఆరేళ్ల క్రిందట 2006లో వంధ్యత్వం (ఇంపోటెన్సీ)పై థీసిస్‌ సమర్పించి ఆంధ్రాయూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ అందుకున్నాను. ఇన్నేళ్ల నా రచనాప్రస్థానానికి నాంది ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా పనిచేసిన నాటి అనుభవంలోనే ఉంది అనిపిస్తుంది. ె

ఆత్మసంతృప్తిని తెచ్చిపెట్టేవి...

కౌన్సిలింగ్‌ సైకాలజిస్టుగా యువతరం, మహిళలు, కుటుంబ సమస్యల పరిష్కారానికి ఎక్కువగా కృషి చేశాను. ధూమపాన వ్యతిరేక ప్రచార కార్యక్రమాలు, ఎయిడ్స్‌పై అవగాహనా సదస్సులు నిర్వహించాను. జువైనల్‌ జస్టిస్‌ బోర్డ్‌ మెంబర్‌గా మెజిస్ట్రేట్‌ హోదాలో విజయవాడ జిల్లా జైలును సందర్శిస్తాను. కౌన్సిలింగ్‌ ద్వారా నేరస్తుల జీవితాల్లో మార్పుకు కృషి జరుగుతోంది. బాలనేరస్తుల జైలులో నేరస్తులకు, వీధిబాలలకు కౌన్సిలింగ్‌ ద్వారా వారి జీవితాలను ఒక గాడిన పెట్టే ప్రయత్నం నేను ఉత్సాహంతో చేస్తున్న పనులు. 1987నుంచి ఇరవై అయిదు సంవత్సరాలుగా సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ అవసరమైన ప్రతిచోటా సేవలందించాను. విజయవాడ ప్రాంతంలోని విజయవంతమైన తొలితరం సైకాలజిస్ట్‌లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి, గుర్తుంచుకోదగిన విజయాలను సాధించడానికి కారణాల్లో రెండోది మా కుటుంబ సభ్యుల సహకారం. నా భార్య పద్మ, పిల్లలు ప్రవీణ్‌, ప్రదీప్‌, సుభాషిణిలను నా విజయంలో భాగస్వాములను అంగీకరిస్తాను. మొదటి కారణం ఏమిటి అని అడిగితే... కృషి, పట్టుదల, దీక్ష ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నేను నమ్మేసూత్రం.

No comments:

Post a Comment