2 October 2012

స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ టిప్స్‌-1


1. మనసారా నవ్వండి
మనసారా నవ్వడం అన్ని విధాలా ఆరోగ్యదాయకం. మీరు నవ్వుతూ ఇతరులను నవ్వించడానికి ప్రయత్నిస్తే మీకూ ఆనందం, ఆహ్లాదం కలగడమే కాక ఇతరుల్నీ ఆనందంగా ఉంచుతారు. మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్‌ అవుతారు. నవ్వడం వల్ల ఫేషియల్‌ మజిల్స్‌, చెస్ట్‌, భుజాలు, మెడ, స్కల్‌ మజిల్స్‌ రిలాక్స్‌ అవుతాయి.

2. నడక - వ్యాయామం
ఉదయం పూట నడక మంచిది. అలా కుదరని పక్షాన సాయంత్రం పూట కూడా నడవచ్చు. నడుస్తూ ప్రకృతి అందాలను తిలకించండి. మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చండి. అలాగే వ్యాయామం చేయడం వల్ల శరీరం రిలాక్స్‌ అవడమే కాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.


3. చక్కటి నిద్ర
రోజుకు 6 గంటలు తక్కువ కాకుండా నిద్రపోవాలి. నిద్రవల్ల మంచి రిలాక్సేషన్‌ ఏర్పడుతుంది. మనస్సు, శరీరం చక్కగా ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటుంది. మధ్యమధ్యలో నిద్రాభంగం కలగకుండా చక్కటి గదివాతావరణం మంచి పడక, మంచిగాలి ఉండేటట్లు చూసుకోవాలి.

4. చల్లటి నీళ్లతో స్నానం
మీరు ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనయినప్పుడు చల్లటి నీళ్లతో స్నానం చేసినట్లయితే శరీరం, మనస్సు హాయిగా ప్రశాంతంగా ఫీల్‌ అవుతారు. అలా కుదరని సందర్భాలలో చల్లటి నీళ్లతో కాళ్లు, చేతులు, ముఖం కడుక్కుని, కావాల్సిన మంచినీరు త్రాగి కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం వల్ల ప్రశాంతంగా ఫీలవుతారు.

5. వీకెండ్‌ ఎంజాయ్‌ చేయండి
బయటకు వెళ్లండి. అందుకోసం చక్కటి ప్రణాళికలు వేయండి. అలా కొన్ని కొత్త ప్రదేశాలకు కాని, మీకు ఇష్టమైన ప్రదేశాలకు కుటుంబ సభ్యులతో లేదా ఫ్రెండ్స్‌తో వెళితే బాగా ఎంజాయ్‌ చేస్తారు. అలా చేస్తే మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు.

6. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనండి.
సంగీతం, సాహిత్య కార్యక్రమాలు మరి కొంతమందికి స్పోర్ట్స్‌, గేమ్స్‌, నృత్యం లాంటి ఇష్టమైన కార్యక్రమాలలో పాల్గొనడం లేదా తిలకించడం చేయడం వల్ల ఒత్తిడికి దూరమవుతారు.

7. వీలుకానప్పుడు నో చెప్పండి.
మీ పరిమితులు, పరిధులు మీకున్నాయి. ప్రతి ఒక్కరు మీతో ఏదో పని చేయించాలని చూస్తారు. అందరినీ సంతోషపెట్టడం అనేది మీకు అలివి కాని పని అని తెలుసుకోండి. ఎదుటివారికి కోపం వస్తుందనుకుని అందరి సమస్యలు మీ నెత్తిన వేసుకుంటూ ఉంటే మీరు మానసిక ఒత్తిడికి గురి అవుతారని తెలుసుకోండి.

8. టైమ్‌ మేనేజ్‌మెంట్‌
ఎవరికైనా 24 గంటల సమయమే ఉంటుంది. అయితే కొంతమంది తమకున్న సమయాన్ని వివిధ కార్యక్రమాలకు చక్కగా ఉపయోగించుకుంటారు. అలా కాలాన్ని సద్వినియోగ పరిచే స్కిల్‌ మీలో ఉంటే ఒత్తిడిని అధిగమిస్తారు. అంటే మీరు ఏఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారో ఒక ప్రయారిటీ లిస్ట్‌ ప్రతిరోజూ రాసుకోవాలి. ముందు ఏ పని చేయాలి. రెండో ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అనే అంశాలు ముందుగా నిర్ణయించుకోవాలి. దానిప్రకారం మీ పనులు సక్రమంగా నిర్వహించుకుంటే ఒత్తిడి ఏర్పడకుండా ఉంటుంది. కొన్ని పనులు అర్జంట్‌ కానివి ఉంటాయి. మరికొన్ని ముఖ్యమైనవి, ఇంకొన్ని ముఖ్యమైనవి కానివి ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో వాటా ప్రాధాన్యత గుర్తించగలిగితే మీకు ఒత్తిడి లేకుండా ఉంటుంది.

 9. ప్లానింగ్‌
మనకు రకరకాల లక్ష్యాలు ఉంటాయి. అయితే వాటిని ఎలా చేరుకోవాలి అనే విషయంలో అనేక సమస్యలు ఏర్పడుతుంటాయి. మనం ఒక చక్కని ప్రణాళికను ఏర్పరుచుకున్నట్లయితే ఆ ప్రణాళిక ప్రకారం ఈజీగా ముందుకు వెళ్లగలుగుతాం. కాని కొంతమంది ఎటువంటి ప్రణాళిక లేకుండా పనులు తలపెడుతుంటారు. ఇటువంటి వారు ఒత్తిడికి లోనవుతుంటారు. కనుక మీరు ఏది చేయాలన్నా మంచి ప్రణాళిక వేసుకోవడం మరిచిపోవద్దు.

10. ఎమోషనల్‌ ఇంటెలిజెన్సీ
అంటే మీలోని ఎమోషన్లను బేలెన్స్‌ చేసుకునే ప్రజ్ఞ మీలో ఉండాలి. ప్రతి ఒక్కరికీ భావోద్వేగాలు ఉంటాయి. అయితే వాటిని సక్రమంగా ఉపయోగించుకున్నట్లయితే ఒత్తిడికి లోనుకాకుండా ఉంటారు. మీరు ఇతరులపై కోపం ప్రదర్శించాలనుకున్నప్పుడు అది మీకు మీతోటి వారికి మధ్య సంబంధ బాంధవ్యాలు చెడిపోకుండా ఉండే విధంగా సున్నితంగా ఉండాలి. అలాకాకుండా అవతలివారిని బాధించే విధంగా ఉన్నా లేదా మీరు అతిగా భావోద్వేగానికి గురి అయినా ఒత్తిడి మిమ్మల్ని వెంబడిస్తుంది.

11. పాజిటివ్‌ థింకింగ్‌
ఆశావహ దృక్పథంతో ఉన్న వ్యక్తులలో సహనం ఎక్కువగా ఉంటూ వారు ఎలాంటి సమస్యలు ఎదురైనా చాలా సున్నితంగా ఆ సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు. వారిలో ప్రొయాక్టివ్‌ బిహేవియర్‌ ఉంటుంది. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంటాయి. వారి ఆలోచనలు ఆచరణ ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇలాంటివారిలో ఒత్తిడి ఏర్పడకుండా ఉంటుంది. ఒకవేళ ఒత్తిడి ఏర్పడ్డా దాన్నించి బయటపడగల నేర్పుకూడా వారిలో ఉంటుంది.

12. స్కిల్‌ ` నాలెడ్జ్‌
ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు మీరు చేసున్న ఉద్యోగంలో మీకు మంచి నైపుణ్యం ఉండాలి. అలాగే ఆ పనిలో మీకు నాలెడ్జ్‌ కూడా బాగుండాలి. అలా మీలోని నైపుణ్యాలను పెంచుకోకుండా ఉంటే మీరు తరచుగా ఒత్తిడికి గురి అవక తప్పదు. మీరు మీకు ఇచ్చిన పనుల్ని సరిగా చేయలేకపోవడం, సరి అయిన సమయంలో మీరు మీబాస్‌కు ఆ పనిని అప్పగించలేక పోవడం తద్వారా ఒత్తిడికి లోనవడం జరుగుతుంది. కనుక స్కిల్‌`నాలెడ్జ్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి.

13. ఎసెర్టివ్‌ బిహేవియర్‌
మీరు ఎగ్జిక్యూటివ్‌ కావచ్చు. లేదా ఆ క్రింది స్థాయి వ్యక్తి కావచ్చు. మీ ప్రవర్తన ఎసెర్టివ్‌గా ఉండాలి. అంటే ప్రతివ్యక్తిలోనూ మూడు రకాలైన ప్రవర్తనలు ఉంటాయి. అంటే పాసివ్‌ బిహేవియర్‌, ఎగ్రెసివ్‌ బిహేవియర్‌ అలాగే ఎసెర్టివ్‌ బిహేవియర్‌, ఎగ్రెసివ్‌ బిహేవియర్‌ వల్ల ఇద్దరి మధ్యా ట్రాన్సాక్షన్స్‌ దెబ్బతింటాయి. అలాగే ఎవరైతే ఎగ్రెసివ్‌గా ఉంటారో వారు మానసికంగా, శారీరకంగా, ఎమోషనల్‌గా అప్‌సెట్‌ అవుతారు. తొందరగా ఒత్తిడికి గురవుతారు. పాసివ్‌ బిహేవియర్‌ ఆమోదయోగ్యం కాదు. అది ఇతరుల ఆత్మాభిమానాన్ని కించపరుస్తుంది. కనుక ఇతరుల్ని అభిమానించి, గౌరవించేది అంతేకాక వారి ఆత్మాభిమానాన్ని పెంపొందించేది. ఎసెర్టివ్‌ బిహేవియర్‌ను అనుసరించడం వల్ల ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఏర్పడి ఒత్తిడి లేకుండా ఉంటుంది.
అలాగే భార్యాభర్తలు మధ్యకాని స్నేహితుల మధ్యకానీ, ఆఫీసులో మీతోటి ఉద్యోగస్తుల మధ్యకాని ఎసెర్టివ్‌నెస్‌ అనేది ఒత్తిడి లేకుండా చేస్తుంది. ఉదాహరణకు మీ అభిప్రాయం బాగుంది. మీరు చెప్పింది కూడా పరిశీలించాల్సిన అంశమే. నేను ఇలా అనుకుంటున్నాను. మీరు ఈ విషయంలో ఎలా స్పందిస్తారు... ఇలా సంభాషణ కొనసాగితే ఇద్దరి మధ్య అనుబంధం బాగుంటుంది.

14. డెలిగేషన్‌
అన్ని పనులు మీరు ఒక్కరే చేయాలనుకోవడం సాధ్యం కాదు. ఆఫీసులో కాని, ఇంట్లో కాని కొన్ని పనులను మీరు ఇతరులకు కేటాయించాలి. ఆయా పనుల ప్రాధాన్యతను బట్టి మీ క్రింది ఉద్యోగులకు, అసిస్టెంట్స్‌కు అలాగే ఇంట్లో అయితే కొన్ని పనులు ఇతర కుటుంబ సభ్యులకు కేటాయించడం వల్ల పని పంచబడుతుంది. దీనివల్ల ఒత్తిడి ఏర్పడదు.

15. ఎంపతీ
ఇతరులు ఉన్న పొజిషన్‌లో మీరు ఉంటే ఎలా ఫీల్‌ అవుతారు. అనే కోణంలో ఆలోచిస్తే మీ ఆలోచనా ధోరణి సవ్యంగా ఉంటుంది. అప్పుడు మీరు ఇతర వ్యక్తులతో అనుబంధం సవ్యంగా ఉంటాయి. ఎంపతీ ఫీలింగ్‌ మనిషిని ఒత్తిడికి గురికాకుండా చేస్తుంది.

16. డెడ్‌లైన్స్‌
మీ ఆఫీసులో మీకు ఇచ్చిన జాబ్‌ ఆఖరి క్షణం వరకూ పూర్తి చేయకుండా ఉంటే లెవెన్త్‌ అవర్‌ టెన్షన్‌కు గురి అవుతారు. దాంతో మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది. అందుకే మీరు చేయాల్సిన పనులు డెడ్‌లైన్‌కు ముందే ముగించండి.

మరిన్ని టిప్స్ కోసంhttp://psydoctortsrao.blogspot.in/2012/10/2.html#more

No comments:

Post a Comment